మెహబూబా ముఫ్తీ దేశద్రోహ వ్యాఖ్యలు చేశారు.. ఆమెను అరెస్ట్ చేయండి: జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ డిమాండ్

24-10-2020 Sat 10:28
  • జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగం
  • దేశం కోసం, జెండా కోసం రక్తాన్ని చిందిస్తాం
  •  ముఫ్తీపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరిన రవీందర్ రైనా
take action against mehbooba mufti
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా డిమాండ్ చేశారు. తమ రాష్ట్రం జెండా తిరిగి వస్తేనే తాము జాతీయ జెండాను ఎగరవేస్తామన్న ముఫ్తీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, ఆమెపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేయాలని గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు.

జమ్మూకశ్మీర్ భారత్ అంతర్భాగమని, జాతీయ జెండా కోసం, దేశం కోసం తాము రక్తాన్ని చిందిస్తామని అన్నారు. కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టవద్దని ముఫ్తీ వంటి నేతలను ఇది వరకే కోరినట్టు రైనా గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని, దానిని చెడగొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించబోమని రైనా హెచ్చరించారు.