'ఆర్ఆర్ఆర్' లేటెస్ట్ టీజర్లో కాపీ దృశ్యాలు... ఆధారాలు పోస్ట్ చేస్తున్న నెటిజన్లు!

24-10-2020 Sat 09:06
  • ఇటీవల విడుదలైన కొమురం భీమ్ పరిచయం
  • నీటిపై ఫోకస్ చేసిన దర్శకుడు రాజమౌళి
  • పాత దృశ్యాలను కాపీ కొట్టారంటున్న నెటిజన్లు
Netigens Posts Evidence that RRR Teaser Copied

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) చిత్రంలో నుంచి కొమురం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్)ను పరిచయం చేస్తూ, ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో కొన్ని సన్నివేశాలు గతంలో విదేశీ చిత్రాల్లో కనిపించినవేనని నెటిజన్లు గుర్తించారు. సినిమాలో చూపిన అగ్నిపర్వతం, దట్టమైన అడవుల సీన్లను గతంలోనే చూసేశామని కామెంట్లు పెడుతున్నారు.

ఇదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో కొమురం భీమ్ సందడి కనిపిస్తోంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా ఒదిగిపోయి వుంటారని, ఈ విషయంలో ఏ మాత్రమూ సందేహం లేదని అంటున్నారు. గతంలో విడుదల చేసిన రామ్ చరణ్ పాత్ర అల్లూరి సీతారామరాజును పరిచయం చేసిన రాజమౌళి, నిప్పును ఎక్కువగా ఫోకస్ చేస్తే, ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రలో నీటిపై ఫోకస్ చేశారన్న సంగతి తెలిసిందే.

ఇక, అగ్నిపర్వతం సీన్ ను వల్కనోస్ పై నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమం నుంచి తీసుకున్నారని అభిమానులు అంటున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. అడవులకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే యూట్యూబ్ నేచర్ లో ఉన్నాయని కనిపెట్టారు. ఆ వీడియోను కూడా పోస్ట్ చేసేశారు. రియల్ టైమ్ లో సినిమాను షూట్ చేసేందుకు రాజమౌళికి సమయం లేకపోయిందన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్ లో కాపీ దృశ్యాలు ఉన్నాయని సాగుతున్న ప్రచారంపై ఆర్ఆర్ఆర్ టీమ్ ఇప్పటివరకూ స్పందించలేదు.