సీబీఐకి అనుమతిని ఉపసంహరించుకోవడానికి కారణం ఇదే: సంజయ్ రౌత్

22-10-2020 Thu 18:00
  • ముంబై పోలీసుల విచారణల్లో కూడా జోక్యం చేసుకుంటోంది
  • ఇది రాష్ట్ర హక్కులను కాలరాయడమే
  • హక్కులకు విఘాతం కల్పిస్తే రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయి
CBI Interferes In Maharashtra Police Probe says Sanjay Raut

మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐ విచారణలకు అనుమతిని ఉపసంహరించుకుంది. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఇప్పటికే ముంబై పోలీసులు విచారిస్తున్న కేసుల్లో కూడా సీబీఐ జోక్యం చేసుకుంటోందని... ఇది రాష్ట్ర హక్కులను కాలరాయడమేనని అన్నారు.

ఒక జాతీయ సమస్యను విచారించే అధికారం సీబీఐకి ఉంటుందని... అయితే, రాష్ట్ర పోలీసులు విచారిస్తున్న కేసుల్లో కూడా కల్పించుకుంటుండటం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహారాష్ట్రకు, మహారాష్ట్ర పోలీసులకు రాజ్యాంగం కల్పించిన సొంత హక్కులు ఉన్నాయని... ఎవరైనా ఈ హక్కులకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.