పెళ్లి చేసుకుందాం.. అంటూ ఓ యువకుడికి టోకరా వేసిన మాయలేడి!

22-10-2020 Thu 16:21
  • పెళ్లి పేరుతో యువకుడ్ని మోసం చేసిన అమ్మాయి
  • రూ.7.20 లక్షలు ఖాతాలో వేయించుకున్న కిలాడీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు
Woman duped youth on the pretext of marriage

పెళ్లి పేరుతో అమాయకులకు గాలం వేసి అందినకాడికి నొక్కేసిన ఘటనలు చాలా జరిగాయి. ఇది కూడా అలాంటిదే. మైనేని సముద్ర అనే పేరుతో ఓ మాయలాడి పెళ్లి పేరుతో యువకుడికి టోకరా వేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమొనీ సంస్థలో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అయితే ఆ యువకుడ్ని ఓ అమ్మాయి పరిచయం చేసుకుంది. తన పేరు మైనేని సముద్ర అని, తన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఉలవపాడు అని తెలిపింది. న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికింది.

అతడు తన ఉచ్చులో చిక్కుకున్నాడని భావించిన తర్వాత, పెళ్లి చేసుకుందాం అని చెప్పి తన ఖాతాలో రూ.7.20 లక్షలు వేయించుకుంది. ఆ తర్వాత పెళ్లి సంబంధం మాట్లాడుకునేందుకు ఆ యువకుడి కుటుంబసభ్యులు ఉలవపాడు గ్రామం వెళ్లి మైనేని సముద్ర గురించి వాకబు చేయగా, వారికి దిమ్మదిరిగే సమాధానం వినవచ్చింది. అలాంటి పేరు గల అమ్మాయిలు ఎవరూ తమ గ్రామంలో లేరని స్థానికులు చెప్పారు. దాంతో తాను మోసపోయానని ఆ యువకుడు గ్రహించి ఆ కిలాడీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.