హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉంది: ఆసుపత్రి వర్గాలు

22-10-2020 Thu 15:07
  • కొవిడ్ బారినపడిన రాజశేఖర్ కుటుంబం
  • కోలుకున్న కుమార్తెలు
  • రాజశేఖర్ కు ఐసీయూలో చికిత్స
  • రాజశేఖర్ ఆరోగ్యంపై ఆందోళన
Hospital sources says actor Rajasekhar health is stable

మా నాన్న కరోనాతో పోరాడుతున్నారు, మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ హీరో రాజశేఖర్ కుమార్తె చేసిన ట్వీట్ అటు సినీ రంగంలోనూ, ఇటు అభిమానవర్గంలోనూ కలకలం రేపింది. రాజశేఖర్ కు ఇప్పుడెలావుందన్న ఆందోళన అందరిలోనూ అధికమైంది. ఆ తర్వాత రాజశేఖర్ కుమార్తె మరో ట్వీట్ చేసి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదన్నా, అప్పటికే రాజశేఖర్ విషయం చర్చనీయాంశం అయింది.

ఈ నేపథ్యంలో, హీరో రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపాయి. వైద్య బృందం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. రాజశేఖర్ కుటుంబం ఇటీవలే కొవిడ్ బారినపడింది. ఆయన కుమార్తెలిద్దరూ కోలుకున్నట్టు తెలుస్తోంది.