Pawan Kalyan: నిత్యావసరాలు పొందాలంటే వారం పాటు నీట మునగాలా?: పవన్ ఆగ్రహం

  • ఇటీవల ఏపీలో భారీగా వర్షాలు
  • పలు జిల్లాల్లో వరదలతో ప్రజల అవస్థలు
  • ప్రభుత్వ విధానంలో మానవీయత లోపించిందన్న పవన్
  • రైతులకు పెట్టుబడి పూర్తిగా చెల్లించాలని డిమాండ్
Pawan Kalyan questions government on flood relief

ఇటీవల ఏపీలో భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వరద ముంపు బారినపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. వరద ముంపులో చిక్కుకుపోయిన వారికి రేషన్, పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో మానవీయత లోపించిందని విమర్శించారు.

నివాసాలు నీట మునిగి, ప్రజలు ఎంతో బాధలో ఉన్నప్పుడు నిత్యావసరాలు అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు. అలాకాకుండా, వారం రోజుల పాటు ముంపులో ఉంటేనే నిత్యావసరాలు అందిస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని పవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ నుంచి వచ్చిన జీవో 19ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద ముంపు బారినపడ్డ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఉపాధి కోల్పోయిన కాలానికి పరిహారం ఇవ్వాలని కోరారు.

రైతుల పెట్టుబడి పరిహారం తక్షణమే చెల్లించాలి!

ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి పెట్టుబడి మొత్తం పరిహారం రూపంలో తక్షణమే చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోయారని, ప్రతి పైసా నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలేదని విమర్శించారు. నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గతేడాది పంటనష్టం తాలూకు పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని, తాజా పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, క్షేత్రస్థాయిలో అంతకంటే ఎక్కువే నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నామని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి కష్టకాలంలో... నష్టాలను లెక్కిస్తాం, పెట్టుబడి రాయితీలు చెల్లిస్తాం అనే ధోరణిని ప్రభుత్వ పాలకులు విడిచిపెట్టాలని హితవు పలికారు. తక్షణమే పరిహారం చెల్లిస్తే తదుపరి పంటకు రైతులు సిద్ధమవుతారని పేర్కొన్నారు.

More Telugu News