Mashrooms: కరోనా వైరస్ కు పుట్టగొడుగులతో చెక్... సాధ్యమేనంటున్న సీసీఎంబీ

CCMB research on Mashrooms to tackle corona
  • పుట్టగొడుగుల్లో విరివిగా యాంటీ ఆక్సిడాంట్లు
  • వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న సీసీఎంబీ
  • క్లోన్ డీల్స్ తో చేతులు కలిపిన సీసీఎంబీ
  • వచ్చే ఏడాది ఆరంభానికి ఫుడ్ సప్లిమెంట్
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికిప్పుడు మానవాళికి అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదీ కనిపించడంలేదు. అందుకే, కరోనాను ఔషధాలతో ఢీకొనడంపై శాస్త్రవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఔషధ గుణాలున్న పదార్థాలతోనూ కరోనాను నిలువరించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశోధిస్తున్నారు.

తాజాగా, సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) పరిశోధకులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మన వద్ద దొరికే పుట్టగొడుగులకు కరోనా వైరస్ ను కట్టడి చేయగల సామర్థ్యం ఉందని అంటున్నారు. పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడాంట్లు, బీటా గ్లూకాన్స్ సాయంతో కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కార్కమిన్ పదార్థాలను పసుపు మిశ్రమంతో కలిపి సరికొత్త ఆహారపదార్థాన్ని తయారుచేసేందుకు సీసీఎంబీ, క్లోన్ డీల్స్ అనే స్టార్టప్ చేతులు కలిపాయి.

ఈ సరికొత్త ఆహారపదార్థం ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పర్చడమే కాకుండా, ఇమ్యూనిటీని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ద్రవ రూప ఆహార పదార్థం. దీనిపై ఎయిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 2021 జనవరి నాటికి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
Mashrooms
Corona Virus
CCMB
Clone Deals
India

More Telugu News