సైనిక సంస్కరణల్లో మరో కీలక నిర్ణయం!: ఆర్మీ చీఫ్ వెల్లడి

22-10-2020 Thu 08:11
  • ‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’ ప్రతిపాదన
  • త్రివిధ దళాల విలీనం తప్పనిసరి
  • అయితే, మరికొంత సమయం పడుతుందన్న నరవణె
Naravane Comments on Integrated Theater Commands

త్రివిధ దళాల మధ్య మెరుగైన సమన్వయం కోసం సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) ఏర్పాటు తరువాత మరో కీలక నిర్ణయం వెలువడింది. ‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’ను ఏర్పాటు చేస్తున్నామని, ఇది సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే తెలియజేశారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే సీడీఎస్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, థియేటర్‌ కమాండ్స్‌ అమల్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పనిసరిగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఉపరితల, వాయు, నౌకా దళాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని, దేశానికి ఉన్న వనరుల వినియోగానికి త్రివిధ దళాల విలీనం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్తంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్‌ నరవణె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాలు ఒక కమాండర్ అధీనంలో ఉంటే, ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా పనిచేయవచ్చని, తద్వారా లక్ష్యాన్ని మరింత సులువుగా చేరుకోవచ్చని నరవణే వ్యాఖ్యానించారు. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ప్రతిపాదన చేశామన్నారు. భారత భవిష్యత్ రక్షణకు ఇది కీలకమైన అడుగుగా మారుతుందని అంచనా వేశారు.