Bimal Gurung: మూడేళ్ల అజ్ఞాతవాసం తరువాత తొలిసారిగా కోల్ కతాలో కనిపించిన గూర్ఖా నేత బిమల్ గురుంగ్!

  • 2017 సెప్టెంబర్ లో అజ్ఞాతానికి
  • వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్దతు
  • ఆమె మరోమారు సీఎం అవుతారు
  • గూర్ఖా రాష్ట్రం కోసం పోరాడుతానన్న బిమల్
Gurkha Chief Bimal Appered in Kolkata after 3 years

పశ్చిమ బెంగాల్ పరిధిలోని డార్జిలింగ్ కొండల ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న గూర్ఖా నేత, మూడు సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్న బిమల్ గురుంగ్, కోల్ కతాలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, మమతా బెనర్జీని మరోమారు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు.

ఈ మూడు సంవత్సరాలూ తాను న్యూఢిల్లీలో ఉన్నానని, ఈ మూడేళ్లూ బీజేపీని చూశానని, వారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు.

కాగా, 2017లో మమతా బెనర్జీని ఓ దెయ్యంగా అభివర్ణించిన బిమల్ గురుంగ్, ఇప్పుడామెను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గూర్ఖాలాండ్ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని సాధించగలమన్న నమ్మకం ఉందని గూర్ఖా జన్ముక్తి మోర్చా చీఫ్ గా ఉన్న ఆయన వ్యాఖ్యానించారు. 2017 సెప్టెంబర్ లో బిమాల్ అనుచరులుగా భావిస్తున్న కొందరు, ఓ పోలీసు అధికారిని హత్య చేసిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోలీసులు బిమాల్ కోసం గాలిస్తున్నారు. ఆయనపై ఉగ్రవాద చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి.

More Telugu News