Naini Narsimhareddy: హేమాహేమీలు అంజయ్య, సంజీవరెడ్డిలను ఓడించిన ఘనత నాయినిదే!

  • తెలంగాణ రాష్ట్రానికి తొలి హోమ్ మంత్రిగా సేవలు
  • నాయినితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న నేతలు
  • కార్మిక సంఘాల నేతగా ఎంతో మంచి పేరు
Importent Incidents in Naini Life

తెలంగాణ ఉద్యమ నేతగా, కార్మిక నాయకుడిగా పేరు తెచ్చుకుని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి హోమ్ మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి, గత అర్థరాత్రి 12.25 గంటలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త టీఆర్ఎస్ పార్టీ నేతలకు దిగ్భ్రాంతి కలిగించింది. పలువురు ప్రముఖ నేతలు ఆయన మృతిపట్ల సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెడుతున్నారు.

ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం నాయిని నర్సింహారెడ్డి స్వభావం కాగా, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటారని, ఎవరు తన సాయం కోరి వచ్చినా, ఆదుకుంటారని ఆయనకు మంచి పేరుంది. తొలుత కార్మిక నేతగా, ఆపై రాజకీయ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన నాయిని, ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హేమాహేమీలుగా పేరున్న వారిని ఓడించి, చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి కార్మిక మంత్రి టి. అంజయ్య, రెడ్డి కాంగ్రెస్ తరఫున మాజీ కార్మిక మంత్రి జి.సంజీవరెడ్డిలు పోటీ పడగా, వారిని ఢీకొన్న నాయిని 2,167 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

ఆపై 1985లో, 2004లో అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో వైఎస్ సీఎంగా ఉన్న వేళ, సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేసిన నాయిని, కేబినెట్ నుంచి టీఆర్ఎస్ వైదొలగిన వెంటనే, తన రాజీనామాను గవర్నర్ కు పంపారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న నాయిని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మలో జన్మించిన నాయిని, హెచ్ఎస్సీ వరకూ విద్యను అభ్యసించారు. ప్రగతిశీల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే నాయిని, 1958లో సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అదే ఆయన జీవితాన్ని మార్చివేసింది. నాటి సోషలిస్ట్ నేత బద్రి విశాల్ పిత్తి కోరిక మేరకు తొలిసారిగా 1970లో హైదరాబాద్ కు వచ్చి, సోషలిస్ట్ పార్టీ ఆఫీసు బాధ్యతలు స్వీకరించారు. తొలుత జాయింట్ సెక్రటరీగా, ఆపై రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేసి, కార్మిక నేతగా మారారు.

తొలుత ట్రేడ్ యూనియన్ నేతగా తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై పోరాడిన ఆయన, ప్రతిష్ఠాత్మక వీఎస్టీ ఎన్నికల్లో విజయం సాధించి, అందరి చూపునూ తనవైపు తిప్పుకున్నారు. దాని తరువాత ఐడీఎల్, హెచ్ఎంటీ, గంగకప్ప కేబుల్స్, మోడ్రన్ బేకరి తదితర కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచారు. పలు కార్మిక సంఘాలకు ప్రెసిడెంట్ గానూ సేవలందించారు.

More Telugu News