Nitish Kumar: నాకు ఓటు వేయాలనుకుంటే వేయండి.. లేదంటే లేదు: నితీశ్ కుమార్ గుస్సా

Stop This Nonsense Nitish Kumars Outburst Over Lalu Zindabad Chants
  • ప్రచారంలో లాలు జిందాబాద్ నినాదాలు
  • ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి గట్టిగా అరిచేసిన సీఎం
  • తేజస్వీ 10 లక్షల ఉద్యోగాల హామీపై కౌంటర్
వచ్చేవారం బీహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రతిపక్ష పార్టీ నేత తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారానికి జనాలు పోటెత్తుతున్నారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి ప్రచారంలోనూ తేజస్వీ యాదవ్ ఇదే మాట చెబుతున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ప్రచారంలో ‘లాలు యాదవ్ జిందాబాద్’ అని కొందరు నినదించడంతో నితీశ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఏం చెబుతున్నారు? ఏం చెబుతున్నారు?’’ అని తన ప్రసంగం మధ్యలోనే గట్టిగా అరిచేశారు. ‘‘ఆ నాన్సెన్స్ మాటలు మాట్లాడేవారు ఎవరో చేయి పైకి లేపండి’’ అని గద్దించారు. కాసేపు నిశ్శబ్దం తర్వాత ‘దాణా దొంగ’ అని ఎవరో గట్టిగా అరవడం వినిపించింది.

అనంతరం నితీశ్ తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభిస్తూ తనకు ఓటు వేయాలనుకుంటే వేయాలని, లేదంటే లేదని అన్నారు. అంతేకానీ, సభలో గందరగోళం సృష్టించవద్దని పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్ 10 లక్షల ఉద్యోగాల హామీని నితీశ్ కొట్టిపడేశారు. పరిణతి, అనుభవం లేనివాళ్లే ఇలాంటి  హామీలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వాలని, 10 లక్షల మందికే ఎందుకని ప్రశ్నించారు. జైలు నుంచి కానీ, నకిలీ నోట్లను ముద్రించడం ద్వారా కానీ ఈ పథకానికి తేజస్వీ యాదవ్ డబ్బులు సమకూరుస్తారా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Nitish Kumar
Lalu Zindabad
Bihar
Tejashwi Yadav

More Telugu News