నిప్పులు చెరిగిన సిరాజ్... ఈ ఐపీఎల్ సీజన్ లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన కోల్ కతా

21-10-2020 Wed 21:32
  • 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన సిరాజ్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేసిన కోల్ కతా
  • 30 పరుగులు చేసిన కెప్టెన్ మోర్గాన్
Siraj fierce bowling crumbles Kolkata Knight Riders for a lowest total in ongoing IPL season

యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ తాజా సీజన్ లో అతి తక్కువ స్కోరు నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేసింది. బెంగళూరు బౌలింగ్ కు కోల్ కతా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బెంగళూరు జట్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో కోల్ కతా బ్యాట్స్ మన్లకు అగ్నిపరీక్ష పెట్టాడు.

సిరాజ్ బౌలింగ్ తీరుకు అతడి గణాంకాలే నిదర్శనం. 4 ఓవర్లు విసిరిన ఈ పొడగరి ఫాస్ట్ బౌలర్ కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రెండు మొయిడెన్లు వేశాడు. సిరాజ్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే తొలి రెండు వికెట్లు తీయడం విశేషం. వరుసగా రెండు బంతుల్లో రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రానా (0)లను అవుట్ చేశాడు.

ఇక సిరాజ్ కు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో కోల్ కతా జట్టు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. కెప్టెన్ మోర్గాన్ 34 బంతుల్లో 30 పరుగులు చేయడంతో ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. కుల్దీప్ యాదవ్ 12 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 2, సుందర్ 1, సైనీ 1 వికెట్ తీశారు.