మనాలిలో షూటింగులో జాయిన్ అయిన నాగార్జున

21-10-2020 Wed 13:31
  • మొదలైన అవుట్ డోర్ షూటింగులు 
  • ఇప్పటికే ఇటలీలో ప్రభాస్, పూజ హెగ్డే  
  • మనాలిలో నాగార్జున 'వైల్డ్ డాగ్' షూట్
  • ముఖ్య పాత్రల్లో దియా మీర్జా, సయామీ ఖేర్  
Nagarjuna joins shoot in Manali

లాక్ డౌన్ తర్వాత మెల్లగా టాలీవుడ్ లో షూటింగులు మొదలవుతున్న సంగతి విదితమే. చిన్న సినిమాలే కాకుండా స్టార్ హీరోల సినిమాల షూటింగులు కూడా హైదరాబాదులో జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ తదితరులు హైదరాబాదులో షూటింగుల్లో పాల్గొంటున్నారు.

మరోపక్క, ప్రభాస్, పూజ హెగ్డే గత కొన్ని రోజులుగా 'రాధేశ్యామ్' సినిమా కోసం ఇటలీలో షూటింగ్ చేస్తున్నారు. త్వరలోనే నితిన్, కీర్తి సురేశ్ కూడా 'రంగ్ దే' షూటింగ్ కోసం ఇటలీ వెళ్లనున్నారు. అలాగే, విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్లో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరగనుంది. 

ఈ క్రమంలో నాగార్జున నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో జరుగుతోంది. నాగార్జున హీరోగా అహిషర్ సోలోమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' పేరిట ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం నాగార్జున మనాలిలో వున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఎస్ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దియా మీర్జా, సయామీ ఖేర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంలో నటిస్తూనే నాగార్జున మరోపక్క 'బిగ్ బాస్ 4' సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.