Dhawan: సెంచరీతో దంచికొట్టిన ధావన్... ఢిల్లీ క్యాపిటల్స్ 164/5

  • దుబాయ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్
  • ధావన్ 106 నాటౌట్
  • వరుసగా రెండు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు
  • ఐపీఎల్ రికార్డు సృష్టించిన ధావన్
Dhawan registered consecutive century in IPL

ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇందులో 106 పరుగులు ఒక్క శిఖర్ ధావన్ బ్యాట్ నుంచే జాలువారాయి. ఓపెనర్ గా బరిలో దిగిన ధావన్ అజేయ సెంచరీ నమోదు చేశాడు. ధావన్ 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులు బాది 106 పరుగులు సాధించాడు.

ధావన్ గత మ్యాచ్ లోనూ సెంచరీ చేయడం తెలిసిందే. దాంతో వరుసగా రెండు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్ మన్ గా ధావన్ రికార్డు సృష్టించాడు. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ తో మ్యాచ్ లో ధావన్ తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ పృథ్వీ షా 7, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 14, రిషబ్ పంత్ 14 పరుగులు నమోదు చేశారు. స్టొయినిస్ 9, హెట్మెయర్ 10 పరుగులు సాధించారు.

మొత్తమ్మీద ఈ ఇన్నింగ్స్ లో ధావన్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో ఉన్న ధావన్ ఏ దశలోనూ అలసట చూపకుండా పరుగులు తీయడంపైనే దృష్టి నిలిపాడు. ఇక, పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, మ్యాక్స్ వెల్ 1, జిమ్మీ నీషామ్ 1, మురుగన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.

More Telugu News