Donald Trump: బైడెన్ ఓ క్రిమినల్.. ఈ విషయాన్ని రిపోర్టింగ్ చేయకపోతే నువ్వూ ఓ క్రిమినలే: రిపోర్టర్ తో ట్రంప్

  • త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • ప్రచారంలో తలమునకలుగా ఉన్న ట్రంప్
  • ప్రత్యర్థి జో బైడెన్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు
Trump calls Biden a criminal

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముంగిట తన మాటల్లో మరింత దూకుడు చూపిస్తున్నారు. ప్రత్యర్థులతో పాటు మీడియాను కూడా వదలడంలేదు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బైడెన్ ను, ఆయన రెండో కుమారుడు హంటర్ బైడెన్ ను క్రిమినల్స్ గా అభివర్ణించిన ట్రంప్... ఈ విషయాన్ని రిపోర్టింగ్ చేయకపోతే నువ్వు కూడా క్రిమినలే అంటూ ఓ రిపోర్టర్ పై అసహనం ప్రదర్శించారు.

జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ పై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ మీడియా ఎందుకు ప్రసారం చేయడంలేదని ట్రంప్ రాయిటర్స్ వార్తాసంస్థ రిపోర్టర్ ను ప్రశ్నించారు. ఏమిటా ఆ అవినీతి? ఎందుకు బైడెన్ కుటుంబ సభ్యులను క్రిమినల్స్ అంటున్నారు? అంటూ సదరు మీడియా రిపోర్టర్ ట్రంప్ ను గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు. దాంతో ట్రంప్ అసహనానికి లోనయ్యారు.

"బైడెన్ ఓ క్రిమినల్, బైడెన్ పక్కాగా దొరికిపోయాడు. అతను చాలాకాలంగా అవినీతికి పాల్పడుతున్నాడు. ఒక్కసారి బైడెన్ లాప్ టాప్ చూస్తే ఎవరు క్రిమినలో అర్థం అవుతుంది. ఈ విషయాన్ని నువ్వు రిపోర్టింగ్ చేయకపోతే నువ్వు కూడా క్రిమినల్ అవుతావు, నీతో పాటు మీడియా కూడా క్రిమినల్ అవుతుంది" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3న జరగనున్న నేపథ్యంలో ట్రంప్, బైడెన్ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.

More Telugu News