సీఎం సహాయనిధికి రెండు నెలల జీతం విరాళంగా ప్రకటించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు... అభినందించిన కేటీఆర్

20-10-2020 Tue 16:43
  • వర్షాలు, వరదలతో కుదేలైన హైదరాబాద్
  • సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు
  • తమవంతుగా  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాయం
TRS ministers and other representatives donates two month salary

హైదరాబాద్ నగరంపై వరుణుడి ప్రతాపం, ఆపై సంభవించిన వరదలు అన్ని వర్గాలను కదిలించాయి. గత వందేళ్లలో నగరంలో ఇంతటి ప్రకృతి విపత్తు ఎన్నడూ లేదు. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. వరద పోటెత్తడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. ఓవైపు కరోనాతో సతమతమవుతున్న వేళ, భారీస్థాయిలో వచ్చిన వరదలతో హైదరాబాద్ వాసులు కుదేలయ్యారు. ఈ క్రమంలో సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి.

తాజాగా, తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ రెండు నెలల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగర ప్రజల కోసం స్పందించి, తమ జీతాలను విరాళంగా ఇస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నా అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.