Raghu Rama Krishna Raju: రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవిపై రఘురామకృష్ణరాజు అసహనం

Raghu Rama Krishna Raju fires on Telakapalli Ravi
  • ఈ మధ్య కాలంలో జగన్ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు
  • జగన్ గురించి మాట్లాడితే తల్లడిల్లిపోయారు
  • ఇతర విషయాల్లో కూడా ఇలాగే స్పందిస్తే బాగుంటుంది
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ముఖ్యమంత్రి జగన్ కు అభిమానిగా మారిపోయినట్టున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. కమ్యూనిస్టు భావంతో గతంలో ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా రవి పని చేశారని... అలాంటి వ్యక్తి చివరకు ఇలా మారిపోవడం బాధాకరమని చెప్పారు. రవికి మాతృభాషపై కూడా చాలా మక్కువని...  సాహితీ స్రవంతి అనే పత్రిక కూడా ఆయనకు ఉందని... అలాంటిది మాతృభాషను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి చర్యను ఆయన ఖండించినట్టు తానెక్కడా చూడలేదని అన్నారు. ఇటీవల కాలంలో జగన్ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు.

కోర్టు ధిక్కరణ కేసులో జగన్ దోషిగా తేలితే ఆయన అభిమానులందరూ ఎంతో బాధపడతారని... అప్పుడు మరో ఓదార్పు చేయాల్సి రావచ్చని తాను వ్యాఖ్యానిస్తే... తెలకపల్లి రవి చాలా బాధపడ్డారని రఘురాజు అన్నారు. ఆయన ముఖకవళికలు కూడా మారాయని, తల్లడిల్లిపోయారని అన్నారు. విశాఖకు రాజధాని తరలిపోతుందని చెప్పినప్పుడు, అమరావతికి 32 వేల ఎకరాలను ఇచ్చిన రైతులు ఎంతో బాధ పడుతున్న సమయంలో తెలకపల్లి రవి బాధపడినట్టు తాను చూడలేదని ఎద్దేవా చేశారు.

గతంలో మీ సహచరుడిగా మీడియాలో పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చాలా పెద్ద వ్యక్తి అయిపోయారని... దాదాపు 100 మంది అమరావతి రైతులు ప్రాణాలు కోల్పోతే సజ్జల అవహేళన చేశారని... అప్పుడు తెలకపల్లి రవి ఏమైపోయారని రఘురాజు ప్రశ్నించారు. రైతులు చనిపోతే ఏ మాత్రం స్పందించని తెలకపల్లి రవి... జగన్ కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే విషయం గురించి మాట్లాడినప్పుడు మాత్రం నిర్ఘాంతపోయారని అన్నారు. భాష విషయంలో, రైతుల మరణం విషయంలో, మీ పాత్రికేయ మిత్రుడు సజ్జల మాట్లాడినప్పుడు కూడా ఇదే విధంగా స్పందించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. జగన్ పై చూపిన స్పందన ఇతర విషయాలపై కూడా చూపెడితే బాగుంటుందని చెప్పారు. గతంలో పక్షపాతం లేకుండా మాట్లాడిన రవి... ఇప్పుడు ఇలా మారిపోవడం బాధాకరమని అన్నారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Telakapalli Ravi

More Telugu News