నీట్ ఫలితాల్లో గందరగోళం.. టాపర్ ను ఫెయిల్ చేసిన వైనం!

20-10-2020 Tue 13:20
  • 720కి గాను 329 మార్కులు వచ్చినట్టు తొలుత ప్రకటన
  • ఓఎంఆర్ షీట్ రీచెకింగ్ చేయించిన విద్యార్థి
  • 650 మార్కులు వచ్చినట్టు తేలిన వైనం
All India topper declared as failed in NEET 2020 exam

ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, మృదుల్ రావత్ అనే విద్యార్థికి తొలుత ఫెయిల్ మార్కులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఓఎంఆర్ షీటును రీచెకింగ్ చేయిస్తే... ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాపర్ గా రావత్ నిలిచాడు.

17 ఏళ్ల రావత్ రాజస్థాన్ లోని మాధోపూర్ జిల్లా గంగాపూర్ కు చెందిన విద్యార్థి. అక్టోబర్ 16న నీట్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రావత్ కు 720కి గాను 329 మార్కులు వచ్చినట్టు మార్కుల జాబితాలో ఉంది. ఆ తర్వాత రీచెక్ చేయించడంతో అతనికి 650 మార్కులు వచ్చినట్టు తేలింది. దీంతో, ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో అతను టాపర్ గా నిలిచాడు. ఇదే సమయంలో జనరల్ కేటగిరీలో 3577వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.