మరో 3 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

20-10-2020 Tue 12:34
  • విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు
  • శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడపలోనూ వాన
  • దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం  
rains in andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మరో మూడు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. కాగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు పశ్చిమ ద్రోణి ఏర్పడింది.