Arvind Kejriwal: తెలంగాణకు ఢిల్లీ ప్రభుత్వం సాయం.. కేజ్రీవాల్ కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్!

Delhi govt will donate Rs 15 cr to the Govt of Telangana
  • రూ. 15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేజ్రీవాల్
  • కష్ట కాలంలో తెలంగాణకు అండగా ఉంటామని వ్యాఖ్య
  • ఎంతో ఉదారతను చాటుకున్నారన్న కేసీఆర్
భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం అందించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మరోవైపు తెలంగాణకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్థికసాయాన్ని ప్రకటిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం నిన్ననే రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా తెలంగాణకు స్నేహ హస్తం చాచింది. వరద బాధితుల సహాయార్థం రూ. 15 కోట్లు ప్రకటించింది. హైదరాబాదులోని సోదర, సోదరీమణులకు ఢిల్లీ ప్రజలు అండగా ఉంటారని ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. కష్ట సమయంలో తెలంగాణకు అండగా ఉంటామని తెలిపారు.

హైదరాబాదును ఆదుకునేందుకు సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేజ్రీవాల్ కు ఫోన్ చేసి కేసీఆర్ మాట్లాడారు. ఎంతో ఉదారతను చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Arvind Kejriwal
AAP
KCR
TRS
Donation

More Telugu News