శాండల్ వుడ్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న బెంగళూరు కోర్టుకు డిటొనేటర్ తో కూడిన పార్శిల్!

20-10-2020 Tue 09:09
  • సంజన, రాగిణిలకు బెయిల్ ఇవ్వండి
  • లేకుంటే న్యాయస్థానం నేలమట్టం
  • డిటోనేటర్ తో ఉన్న లేఖ పార్శిల్
  • కేసును విచారిస్తున్న పోలీసులు
Detonator and Threat Letter sent to Bengalure Court

కన్నడ సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న డ్రగ్స్ వ్యవహారాన్ని విచారిస్తున్న బెంగళూరు కోర్టుకు, ఓ వ్యక్తి డిటొనేటర్ తో కూడిన పార్శిల్ ను పంపడం కలకలం రేపింది. కొరియర్ ద్వారా వచ్చిన ఈ పార్శిల్ లో ఉన్న లేఖలో స్థానిక కోర్టు న్యాయమూర్తిని హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ కూడా ఉంది. "రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ వంటి అమాయకులను ఈ కేసులో అరెస్ట్ చేశారు. వారికి వెంటనే బెయిల్ ఇవ్వాలి. లేకుంటే న్యాయస్థానాన్ని నేలమట్టం చేస్తాం" అని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు దిగాడు.

ఇక ఇదే లేఖ కాపీ బెంగళూరు పోలీస్ చీఫ్ కు కూడా వెళ్లడంతో, పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ పార్శిల్ కోర్టుకు వచ్చిన తరువాత చాలాసేపు దాన్ని తెరవలేదు. ఆ తరువాత కోర్టు ఉద్యోగి దీన్ని తెరువగా, డిటొనేటర్ తో పాటు లేఖ కనిపించింది. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, దాన్ని స్వాధీనం చేసుకుని, విశ్లేషణకు పంపింది. కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు చేపట్టారు.

కాగా, చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్ దందాను నడిపిస్తున్నారన్న ఆరోపణలపై నటీమణులను సెప్టెంబర్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మరికొందరితో కలిసి మాదకద్రవ్యాలను తెప్పించి, సినీ పరిశ్రమలోని పలువురికి, బడా వ్యాపారులకు అందించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసును ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) విచారిస్తోంది. సంజన సన్నిహితుడు రియల్టర్ రాహుల్ పేరు తొలుత బయటకు రాగా, అతన్ని విచారించిన తరువాత డ్రగ్స్ కేసులో సంజన ప్రమేయంపై అధికారులకు ఆధారాలు చిక్కాయి.