హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం

20-10-2020 Tue 06:58
  • మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించిన అధికారులు
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
heavy rains pouring on Hyderabad

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్‌ను వానలు వీడడం లేదు. తెరిపిచ్చినట్టే ఇచ్చి మళ్లీ పడుతున్నాయి. నిన్న సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరిగి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇంకా కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, పాతబస్తీ, బేగంపేట, బోయిన్‌పల్లి, నాంపల్లి, ప్యారడైజ్, కోఠి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, జీడీమెట్ల, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.

మరోవైపు, మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక శిబిరాలకు తరలించారు. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.