Moon: చంద్రుడిపై 4జీ, 5జీ... నాసాతో డీల్ కుదుర్చుకున్న నోకియా!

  • తొలుత 4జీ నెట్ వర్క్ ఏర్పాటు
  • తదుపరి దశలో 5జీకి విస్తరణ
  • 14.1 మిలియన్ డాలర్ల తొలి పెట్టుబడి
Noka and Nasa Deal to Develop Mobile Network on Moon

వినేందుకు కాస్తంత విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇకపై చంద్రుడి మీదకు వెళ్లే వారు తమ స్మార్ట్ ఫోన్లను తీసుకెళ్లి, అక్కడి నుంచి వాడుకోవచ్చు. చంద్రుడిపై మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని, అది కూడా 4జీ, 5జీ తరంగాల కమ్యూనికేషన్ నెట్ వర్క్ గా ఉండాలని భావిస్తున్న నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ), అందుకోసం ప్రముఖ టెలికం సంస్థ నోకియాతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా చందమామపై 4జీ సెల్యులార్ నెట్ వర్క్ ను నోకియా ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టు కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధిని నాసా అందించనుంది. తొలుత చందమామపై 4జీ ఎల్టీఈ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్న నోకియా, తదుపరి దశలో దాన్ని 5జీకి అప్ గ్రేడ్ చేయనుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే, చంద్రుడి ఉపరితలంపై సమాచార మార్పిడి వేగవంతం అవుతుందని, పెరిగే వేగంతో ప్రస్తుత ప్రమాణాలతో పోలిస్తే, మరింత విశ్వసనీయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని ఈ సందర్భంగా నాసా వ్యాఖ్యానించింది.

కాగా, మరో 8 సంవత్సరాల్లో... అంటే, 2028 నాటికి చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని గతంలోనే నిర్దేశించుకున్న నాసా, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందిస్తోందని కార్యనిర్వాహక ప్రతినిధి జిమ్ బ్రిడెన్ స్టైన్ వెల్లడించారు. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు అక్కడే నివాసం ఉండేందుకు వీలైన పనులు ప్రారంభించాలని భావిస్తున్నామని, అందుకోసం అధునాతన టెక్నాలజీని వినియోగిస్తామని అన్నారు. చంద్రుడిపై ఎక్కువకాలం ఉండాలంటే, విద్యుత్ వ్యవస్థలు, టెలికం అభివృద్ధి తప్పనిసరని అన్నారు. అందుకోసమే నోకియాతో డీల్ కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు.

More Telugu News