ఏపీలో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

19-10-2020 Mon 07:55
  • తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • నేడు అల్పపీడనంగా మారి బలపడే అవకాశం
  • రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు
heavy rain forecast in AP today and tomorrow
ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో నేడు కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.