హైదరాబాద్ నగరానికి మళ్లీ వర్ష సూచన... మరో మూడ్రోజులు భారీ వర్షాలే!

18-10-2020 Sun 13:15
Another rain alert issued for Hyderabad city
  • హైదరాబాదుపై వరుణుడి పంజా
  • గత రాత్రి కూడా కుండపోత
  • నగరం జలమయం
  • క్యుములోనింబస్ మేఘాలే కారణమంటున్న వాతావరణ శాఖ

హైదరాబాద్ నగరంలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. నిన్న రాత్రి కూడా కుండపోత వర్షం కురిసింది. ఇప్పటికే ఓసారి జలవిలయం పాలైన భాగ్యనగరం శనివారం రాత్రి కురిసిన వానతో మరింత తల్లడిల్లింది. హైదరాబాద్ నగరం జలప్రళయంలో చిక్కుకున్న తీరును సోషల్ మీడియాలో పలు వీడియోలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు మరోసారి వర్ష సూచన జారీ అయింది.

మరో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కురుస్తున్న వర్షాలు, రాగల 48 గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా వ్యాపిస్తాయని తెలిపింది.

వాతావరణంలో విపరీత మార్పులే ఈ వర్షాలకు కారణమని, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఎక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.