రాణించిన రాయుడు,డుప్లెసిస్, జడేజా... చెన్నై సూపర్ కింగ్స్ 179/4

17-10-2020 Sat 21:25
Chennai Super Kings posted reasonable score against Delhi Capitals
  • షార్జాలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • డుప్లెసిస్ అర్ధసెంచరీ
  • 13 బంతుల్లో 33 పరుగులు చేసిన జడేజా

ఐపీఎల్ లో భాగంగా షార్జా క్రికెట్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 58 పరుగులు చేయగా, వెటరన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ 6 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు.

తెలుగుతేజం అంబటి రాయుడు వేగంగా ఆడి 45 పరుగులు నమోదు చేశాడు. 25 బంతులు ఎదుర్కొన్న రాయుడు 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. ఇక చివర్లో లెఫ్ట్ హ్యాండర్ రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించాడు. కేవలం 13 బంతులు ఆడిన జడేజా 4 సిక్సర్లతో 33 పరుగులు సాధించాడు.

అంతకుముందు ఓపెనర్ శామ్ కరన్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ ధోనీ 3 పరుగులకే వెనుదిరిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జె 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, కగిసో రబాడా చెరో వికెట్ దక్కించుకున్నారు.