నాకు ఎదురైన చేదు అనుభవం అదొక్కటే!: హీరోయిన్ చాందిని

17-10-2020 Sat 13:21
chandini about her career
  • ‘కలర్‌‌ఫోటో’ సినిమా ఈ నెల 23న ఓటీటీలో విడుదల 
  • సినిమాలో వర్ణ వివక్షే కథ
  • సమాజంలో ఇప్పటికీ వర్ణ వివక్ష ఉందన్న చాందిని
  • రంగును బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు 

తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి నటించిన ‘కలర్‌‌ఫోటో’ సినిమా ఈ నెల 23న ఓటీటీలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపింది. తనకు సందీప్‌ రాజ్‌ ‘కలర్‌ ఫొటో’ కథ చెప్పగానే, వెంటనే అంగీకరించానని చెప్పింది. ఈ సినిమాలో నటిస్తోన్న సుహాస్ కొత్త హీరో అని విషయాన్ని తాను ఆలోచించలేదని తెలిపింది.

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు విభిన్న కథలతో రూపొందే సినిమాలను ఆదరిస్తున్నారని చెప్పింది. ఈ సినిమా కథ 1990 కాలం నేపథ్యంలో కొనసాగుతూ వర్ణవివక్ష ప్రధానాంశంగా రూపుదిద్దుకుందని పేర్కొంది. తాను 1990 నాటి అమ్మాయిలా, స్వతంత్ర భావాలు కలిగిన పల్లెపడుచులా కనపడతానని తెలిపింది.

ఇక ఈ సినిమాలో వర్ణ వివక్ష గురించి ఉంటుందని, సమాజంలో ఇప్పటికీ వర్ణ వివక్ష ఉందని, తాను హీరోయిన్ అయ్యాక తనను నువ్వేమైనా పెద్ద కలర్ అనుకుంటున్నావా? అని ఒకరు ప్రశ్నించారని చెప్పింది. తనకు ఎదురైన చేదు అనుభవం ఇదొక్కటేనని చెప్పింది.

రంగును బట్టి ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని, హోదాను అంచనా వేయడం సరికాదని ఈ సుందరి అభిప్రాయపడింది. ప్రస్తుతం తన చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు చెప్పింది. కాగా, కలర్ ఫొటో సినిమాలో హీరో నల్లగా, అమ్మాయి తెల్లగా ఉంటుంది. వీరిద్దరు ప్రేమలో పడతారు.