భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు!

17-10-2020 Sat 13:12
KTR gives key orders to GHMC on rains
  • 24 గంటల్లో విద్యుత్ ను పునరుద్ధరించండి
  • దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయండి
  • స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించండి

విద్యుత్ సరఫరా నిలిచిపోయిన అపార్ట్ మెంట్లు, కాలనీలకు 24 గంటల్లో సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాదులోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. అనంతరం జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని... దీనికోసం రూ. 297 కోట్లను విడుదల చేస్తున్నామని చెప్పారు.

దెబ్బతిన్న నీటి పైప్ లైన్లు, సివరేజ్ లైన్లను రూ. 50 కోట్లతో పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ను కేటీఆర్ ఆదేశించారు.