రాష్ట్ర సర్కారు దొడ్డిదారిలో రుణ సేకరణకు విశ్వ ప్రయత్నం చేస్తోంది: ఐవైఆర్ వ్యాఖ్యలు

17-10-2020 Sat 10:24
iyr slams ap govt
  • రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో శ్రీవారి సొమ్ము?
  • పూర్తి వివరాలతో టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుంది
  • బడ్జెట్ బయట ఎస్పీవీల ద్వారా రుణ సేకరణ సరికాదు
  • రాష్ట్రాలకు అప్పుల సేకరణ కోసం ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుంది
  • అటువంటి బాండ్లలో పెట్టటానికి టీటీడీకి అర్హత ఉందా?  

‘తిరుమల వెంకన్న సొమ్ము జగనన్నకు’ అంటూ గోవిందా.. గోవిందా పేరిట ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ దీనిపై తన అభిప్రాయాలను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో శ్రీవారి సొమ్ము ఉండనుందని, ఈ మేరకు టీటీడీ పాలక మండలి అడ్డగోలు తీర్మానం చేసిందని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్న అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఇప్పటిదాకా షెడ్యూల్డు బ్యాంకుల్లోనే డిపాజిట్లు ఉండేవని, రాష్ట్ర సెక్యూరిటీని అదనంగా బోర్డు చేర్చిందని అందులో పేర్కొన్నారు. డిసెంబరులో భారీగా ఎఫ్‌డీల మెచ్యూరిటీని ఖజానాకు తరలించే అవకాశం ఉందని, ఈ మేరకు ఆగస్టు 28న తీర్మానం చేసి, అంతులేని గోప్యతను పాటించారని, శ్రీవారి సొమ్ముకు భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నారు.

వాటన్నింటిపై ఐవైఆర్ స్పందిస్తూ... ‘ఈ అంశంపై పూర్తి వివరాలతో టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుంది. ఈనాడు ఉన్న విధానం ప్రకారం జాతీయ బ్యాంకుల నుండి కొటేషన్లు తీసుకొని అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులో డిపాజిట్ చేసే విధానం. ఈ విధానం మార్చవలసిన అవసరం వివరించాలి. రాష్ట్రాలకు అప్పుల సేకరణ కోసం ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుంది’ అని చెప్పారు.

‘అటువంటి బాండ్లలో పెట్టటానికి టీటీడీకి అర్హత ఉందా? ఉంటే అక్కడ ఎక్కువ వడ్డీ రేటు వచ్చేటట్లు అయితే పెట్టడానికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో బడ్జెట్ బయట ఎస్పీవీ ల ద్వారా రుణ సేకరణకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. బ్యాంకులు అంతగా సహకరిస్తున్నట్లు లేదు’ అని ఐవైఆర్ తెలిపారు.

‘అటువంటి బాండ్లలో పెట్టుబడి పెట్టడం అంటే నిస్సందేహంగా ఇటు ప్రభుత్వం ఒత్తిడి అటు టీటీడీ అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది’ అని ఐవైఆర్ పేర్కొన్నారు.