పంజాబ్ లో శౌర్యచక్ర అవార్డు గ్రహీతను కాల్చి చంపిన దుండగులు

16-10-2020 Fri 21:41
Showrya Chakra awardee Balwinder Singh shot dead
  • తరన్ తరన్ జిల్లాలో ఘటన
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పంజాబ్ సీఎం
  • ఘటనపై దర్యాప్తు కోసం సిట్ నియామకం

పంజాబ్ లో శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్ ను కొందరు దుండగులు ఆయన నివాసంలోనే కాల్చి చంపారు. తరన్ తరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బల్వీందర్ సింగ్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. 62 ఏళ్ల బల్వీందర్ సింగ్ కు గతేడాది భద్రత తొలగించారు. స్థానిక పోలీసుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఉదయం ఏడింటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బల్వీందర్ నివాసంలోకి చొరబడి అత్యంత సమీపం నుంచి గుళ్ల వర్షం కురిపించారు. దాంతో ఆయన సంఘటన స్థలంలోనే కన్నుమూశారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ హత్యోదంతంపై సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, 1990లో బల్వీందర్ సింగ్ పేరు మార్మోగిపోయింది. దాదాపు 200 మందితో కూడిన టెర్రరిస్టు మూక ఆయన కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆ సమయంలో బల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు, వారి భార్యలు అత్యంత తెగువతో ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. దాదాపు ఐదు గంటల సేపు జరిగిన ఆ పోరాటంలో పిస్టళ్లు, స్టెన్ గన్లతోనే అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. చివరికి టెర్రరిస్టులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు తోకముడిచారు. ఈ ఘటన నాడు బల్వీందర్ సింగ్, ఆయన కుటుంబానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది.