నితీశ్ అలసిపోయారు.. బీహార్ ను హ్యాండిల్ చేయలేరు: తేజస్వి యాదవ్

16-10-2020 Fri 19:41
Nitish Kumar is tired says Tejashwi Yadav
  • నామినేషన్ దాఖలు చేసిన తేజశ్వియాదవ్
  • తమదే గెలుపని ధీమా వ్యక్తం చేసిన ఆర్జేడీ నేత
  • అన్ని హామీలను నెరవేరుస్తామని వ్యాఖ్య

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సుదీర్ఘ ప్రయాణంలో నితీశ్ కుమార్ అలసిపోయారని, ఇకపై ఆయన రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేరని చెప్పారు. అభివృద్ధి, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, పేదరికం వంటి అంశాలపై నితీశ్ కుమార్ చర్చించాలనుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

 బీహార్ కు నలువైపులా భూమి మాత్రమే ఉందని, పోర్టులు లేకపోవడంతో ఇండస్ట్రీలు రావడం లేదని, అందువల్లే ఉద్యోగాలను సృష్టించలేకపోతున్నామని నితీశ్ చెపుతారని అన్నారు. రఘోపూర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీహార్ ప్రజలు తమను గెలిపిస్తారనే నమ్మకం తమకు ఉందని... తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.