భార్యపై అనుమానం... తల నరికి మరో వ్యక్తి ఇంటిముందు పడేసిన భర్త!

15-10-2020 Thu 14:59
Man cuts his wife head and thrown it in front of a house
  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం
  • భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త
  • గొడ్డలితో తల నరికి హత్య

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిలో అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్య తల నరికిన ఓ వ్యక్తి, ఆ తలను మరో వ్యక్తి ఇంటి ముందు పడేసిన వైనం వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నారాయణఖేడ్ కు చెందిన సాయిలు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 50 ఏళ్ల సాయిలు ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆమెపై కసితో రగిలిపోయేవాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్య తలను గొడ్డలితో నరికాడు. రక్తమోడుతున్న భార్య తలతో బైక్ పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాడు.  ఆ తలను తీసుకువెళ్లి, భార్య ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తాను అనుమానిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంటిముందు పడేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సాయిలును అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది.