పంచ్ డైలాగుల కోసం పెన్ను పట్టిన తమిళ సూపర్ స్టార్!

15-10-2020 Thu 12:43
Rajanikanth writes him self punch dialogues for his latest
  • రజనీకాంత్ సినిమాలలో పంచ్ డైలాగుల ప్రత్యేకత 
  • తాజా చిత్రం 'అన్నాత్తే'లో గ్రామ సర్పంచ్ పాత్ర
  • తన డైలాగులు తానే రాసుకుంటున్న రజనీ
  • త్వరలో హైదరాబాదులో ప్రత్యేక సెట్లో షూటింగ్  

స్టార్ హీరోలకు పంచ్ డైలాగులు ఉండాలి. ఒక్కో డైలాగు వదులుతుంటే థియేటర్ దద్దరిల్లాలి. ప్రేక్షకాభిమానులు కేరింతలు కొట్టాలి. అందులోనూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో అయితే తప్పకుండా అలాంటి పంచ్ డైలాగులు బాగా పేలాలి. అసలు ఆయన డైలాగుల కోసమే ప్రేక్షకులు సినిమాకు మళ్లీ మళ్లీ వస్తుంటారు. అందుకే ఆయన తన సినిమాలో డైలాగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూవుంటారు.

ఇక విషయానైకి వస్తే, తాజాగా ఆయన శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' పేరిట ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో రజనీ గ్రామ సర్పంచ్ గా ఓ సరికొత్త తరహా పాత్రను పోషిస్తున్నారు. దీంతో తన పాత్రకి మాంచి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు ఉండాలన్న ఉద్దేశంతో ఆయనే రంగంలోకి దిగారట. తన పాత్రకి అలాంటి పంచ్ డైలాగులను తానే స్వయంగా రాసుకుంటున్నారని తెలుస్తోంది. దర్శకుడు శివతో ఫోన్ లో చర్చిస్తూ డైలాగులు రాసుకుంటున్నారట.

అయినా, ఇలా తన పాత్రకు తానే డైలాగులు రాసుకోవడం రజనీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా 'బాబా' వంటి కొన్ని సినిమాలలో ఆయన రాసుకున్నారు. అవి బాగా పేలి.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందాయి. అందుకే, మళ్లీ ఇప్పుడు ఈ చిత్రం కోసం ఆయన పెన్ను పట్టారట.

ఇక ఈ చిత్రం లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ జరుపుకుంది. త్వరలో హైదరాబాదులో షూటింగ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సెట్లు కూడా వేస్తున్నారు. ఇందులో రజనీ సరసన ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు.