టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి చేదు అనుభవం

15-10-2020 Thu 12:27
  • నిండిన చెరువుకు పూజ చేసేందుకు వచ్చిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి  
  • రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో నిలదీసిన స్థానికులు
  • తాము భూములు కోల్పోతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆయన వాహనంపై జనాలు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే వర్షాల కారణంగా నిండిన చెరువుకు పూజ చేసేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మేడిపల్లికి ఆయన వెళ్లారు.

 ఈ సందర్భంగా ఆయనను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఫార్మా సిటీ కోసం చేస్తున్న భూసేకరణను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల కోసం తాము భూములు కోల్పోతుంటే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా స్థానికులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు మంచిరెడ్డి యత్నిస్తుండగా... ఆయన వాహనంపై చెప్పులు, రాళ్లను రైతులు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.