సెల్లార్ లో వర్షం నీళ్లు.. కరెంటు షాక్‌తో వైద్యుడి మృతి!

15-10-2020 Thu 07:29
Doctor died with current shock in Hyderabad
  • భారీ వర్షానికి సెల్లార్‌లోకి చేరిన నీళ్లు
  • మోటార్‌తో బయటకు పంపే ప్రయత్నంలో విద్యుదాఘాతం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

హైదరాబాద్‌లో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షం ఓ వైద్యుడి ప్రాణాలను బలిగొంది. సెల్లార్‌లోకి వచ్చిన నీటిని మోటార్‌తో తొలగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో జరిగిందీ ఘటన. సతీశ్ రెడ్డి అనే వైద్యుడు స్థానిక ఎస్‌బీహెచ్ కాలనీలో నివసిస్తున్నాడు.

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వరద నీరు రావడంతో అది నిండిపోయింది. దీంతో నిన్న ఉదయం నీటిని తోడేందుకు మోటార్ వేసేందుకు సతీశ్‌రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.