శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవత్వంతో వ్యవహరించండి: అధికారులకు ఏపీ సీఎం జగన్ సూచన

14-10-2020 Wed 19:48
Jagan conducts review meeting on flood situation
  • వరద ఉద్ధృతిపై సమీక్ష నిర్వహించిన జగన్
  • శిబిరాల్లో ఉన్న వారికి రూ. 500 సాయం చేయండని ఆదేశం
  • సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్న సీఎం

రాష్ట్రంలో వరద ఉద్ధృతిపై అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ. 500 చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు. వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని చెప్పారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. రోడ్లపై గుంతలను పూడ్చాలని, అన్ని రోడ్లను వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో అన్ని మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోందని... ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని జగన్ సూచించారు. వాయుగుండం తీరాన్ని దాటినందున ఇబ్బంది లేదని... అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.