అవినీతి నిరోధక శాఖ అదుపులో మల్కాజిగిరి మాజీ ఏసీపీ బినామీలు

14-10-2020 Wed 11:12
8 members in telangana acb custody in ex acp illegal assets case
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నర్సింహారెడ్డి
  • 50 కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలతో కాజేసేందుకు బినామీలుగా వ్యవహరించిన వైనం
  • రెండు రోజులపాటు విచారించనున్న ఏసీబీ

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి బినామీలుగా అనుమానిస్తున్న 8 మందిని ఏసీబీ అధికారులు నిన్న తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 2న పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతితో ఏసీబీ అధికారులు వీరిని తమ అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ అదుపులో ఉన్న వారిలో గోపగోని సజ్జన్ గౌడ్, పోరెడ్డి తిరుపతిరెడ్డి, ఎర్రా చంద్రశేఖర్, అర్జుల జైపాల్, మధుకర్ శ్రీరాం, బండి చంద్రారెడ్డి, బత్తిన రమేశ్, అలుగువెల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ వద్ద బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకునేందుకు వీరంతా నర్సింహారెడ్డికి బినామీలుగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.