Dating App: అమ్మాయిలను ఎరగా వేసి భారీ మోసం!

  • డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన పశ్చిమ బెంగాల్ వ్యక్తి
  • నమ్మి నిండా మోసపోయిన హైదరాబాద్ యువకుడు
  • గత వారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hyderabad Police Arrest 2 People in West Bengal in Dating App Scam

డేటింగ్ యాప్ ను ప్రారంభించి, అందమైన అమ్మాయిల చిత్రాలను పంపించి, తమ వలలో పడిన వారి నుంచి భారీగా డబ్బులు దండుకున్న ఇద్దరు పశ్చిమ బెంగాల్ యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారంట్ పై నిన్న నగరానికి తీసుకుని వచ్చారు.

సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే... ఈ సంవత్సరం జనవరి 7న హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను అమ్మాయిలను సరఫరా చేస్తానని చెబుతూ, అతన్ని నమ్మించాడు.

అమ్మాయిల ఫోటోలు, ఫోన్ నంబర్లు, వివరాలు పంపాలంటే డబ్బు కట్టాలని, తొలుత మెంబర్ షిప్ కార్డు తీసుకుంటే, మరిన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పాడు. మెంబర్ షిప్ కార్డుల్లోనూ వెరైటీలున్నాయని, గోల్డ్ కార్డ్ తీసుకుంటే, హోటల్ బుకింగ్స్, మీటింగ్స్, డేటింగ్స్ ఉంటాయని చెబుతూ, రూ. 48 వేల వరకూ వసూలు చేశాడు. అందమైన అమ్మాయిల చిత్రాలను చూసి, వారితో గడపాలన్న ఆశతో, నెట్ బ్యాంకింగ్, పేటీఎం తదితరాల ద్వారా డబ్బులు చెల్లించిన బాధితుడికి, పూర్తిగా మునిగిన తరువాత అనుమానం వచ్చింది.

జనవరి 22న అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అతనిచ్చిన ఎకౌంట్ నంబర్ల ఆధారంగా కేసు దర్యాఫ్తును ప్రారంభించారు. ఈ నెల 9న ప్రధాన నిందితుడు కోల్ కతాకు చెందిన 31 ఏళ్ల ఆనంద్ కార్, రెండో నిందితుడు 24 పరగణా జిల్లాకు చెందిన బుద్ధదేవ్ పాల్ అని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ఆపై పశ్చిమ బెంగాల్ కోర్టులో హాజరు పరిచి, తదుపరి విచారణ నిమిత్తం నిందితులను హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు.

More Telugu News