హైదరాబాద్ లో గోడ కూలి రెండు నెలల చిన్నారి సహా 9 మంది దుర్మరణం!

14-10-2020 Wed 08:35
9 Died after Compound Wall Collapse in Hyderabad
  • నిండుకుండల్లా జలాశయాలు
  • మూడు రోజుల నుంచి భారీ వర్షం
  • ఘటనాస్థలిని సందర్శించిన ఎంపీ ఒవైసీ

నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షం, హైదరాబాద్ లో తీవ్ర విషాదానికి కారణమైంది. పాతబస్తీ పరిధిలో ఓ కాంపౌండ్ వాల్ కుప్పకూలి, పది ఇళ్లపై పడగా, తొమ్మిది మంది మరణించారు. వారందరి మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

 గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు నాలాలు, కాలువలు పొంగి పొరలుతుండగా, నగరానికి ప్రధాన మంచినీటి జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట రిజర్వాయర్లు పూర్తిగా నిండుకున్న సంగతి తెలిసిందే. నాలాలు పొంగి పొరలుతూ ఉండటంతో, దానికి పక్కనే ఉన్న ఓ పెద్ద కాంపౌండ్ వాల్ కుప్పకూలి, పక్కనే ఉన్న ఇళ్లపై పడింది.

ఈ విషయాన్ని వెల్లడించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, "భారీ వర్షాల కారణంగా, బండ్లగూడ పరిధిలోని మహమ్మమీదియా హిల్స్ లో ఓ ప్రైవేటు స్థలం ప్రహరీ గోడ కుప్పకూలింది. నేను ఘటనా స్థలికి వెళ్లాను. రెండు నెలల చిన్నారి సహా 9 మంది మరణించారు. అక్కడి ప్రజలను శంషాబాద్ లోని సురక్షిత స్థలానికి తరలించారు. ముంపు అధికంగా ఉన్న తలాబ్ కట్టా, యాస్రాబ్ నగర్ ప్రాంతాలకు నేను వెళుతున్నాను" అని ఆయన గత అర్ధరాత్రి 12.30 గంటల తరువాత ట్వీట్ చేశారు.

ఇక, వర్షాలు మరింతగా కురుస్తాయని వాతావరణ శాఖ విభాగం హెచ్చరించిన వేళ, అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, సాధ్యమైనంత వరకూ ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఏపీ, తెలంగాణల్లో గడచిన 24 గంటల వ్యవధిలో సగటున 11 నుంచి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.