మా ఆవిడకు కరోనా సోకనందుకు ఎంతో సంతోషంగా ఉంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

13-10-2020 Tue 19:55
Venkaiah Naidu says he delighted that his wife Usha Naidu is not at all affected by the novel Coronavirus
  • కరోనా నుంచి కోలుకున్న వెంకయ్యనాయుడు
  • ఎంతో ఆనందంగా ఉందని వెల్లడి
  • తన అర్ధాంగి గుండెనిబ్బరంతో ఉందన్న వెంకయ్య

కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. కరోనా నుంచి కోలుకోవడం ఎంతో ఆనందదాయకం అని పేర్కొన్నారు. సెప్టెంబరు 29న కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లానని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని వెల్లడించారు.

 అయితే, తన అర్ధాంగి ఉషకు కరోనా సోకకపోవడం పట్ల తాను ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. ఆమె ఎంతో గుండెనిబ్బరంతో ఉందని, ఆమె ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని వెంకయ్య వివరించారు.

అంతేకాకుండా, తన కార్యాలయంలో పనిచేస్తూ కరోనా వైరస్ ప్రభావానికి గురైన మరో 13 మంది ఉద్యోగులు కూడా పూర్తిగా కోలుకోవడం పట్ల కూడా అంతే సంతోషిస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు.

"నా ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైద్య సిబ్బందికి వేళకు సలహాలు అందిస్తూ నా ఆరోగ్యం కుదుటపడడంలో తోడ్పాటు అందించిన ఎయిమ్స్ నిపుణులకు ధన్యవాదాలు. నేను నిజంగా వారి సేవల పట్ల సంతృప్తి చెందాను. ఇక, నాకోసం అహర్నిశలు పనిచేసిన నా వ్యక్తిగత సిబ్బంది విక్రాంత్, చైతన్యలకు అభినందనలు" అంటూ వెంకయ్య ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.