ఇందులో నేను కూడా భాగస్వామి అయినందుకు సిగ్గుపడుతున్నా: రఘురామకృష్ణరాజు

13-10-2020 Tue 15:22
Conspiracy is taking place in AP to damage judiciary
  • న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే యత్నాలు ఏపీలో జరుగుతున్నాయి
  • కోర్టులను దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
  • న్యాయ వ్యవస్థను రాష్ట్రపతి కాపాడతాడు

న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెపుతున్నప్పటికీ... ఏపీలో దాడులు ఆగడం లేదని చెప్పారు. కోర్టులను దూషించిన వారిలో నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్ తో పాటు పలువురు రెడ్ల పేర్లు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా దూషించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని... వైసీపీ నేతలకు ఇబ్బంది కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం క్షణాల్లో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేని నిస్సహాయ, చేతకాని సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందని అన్నారు. ఆనాటి కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని... నేటి కౌరవసభలో న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కౌరవసభలో తాను కూడా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ఆనాడు ద్రౌపదిని గోవిందుడు కాపాడాడని... ఈరోజు న్యాయవ్యవస్థను కోవిందుడు (రాష్ట్రపతి) కాపాడతారని చెప్పారు.