సజ్జల ఆర్ఆర్ గ్లోబల్ చరిత్ర అంతా నాకు తెలుసు... రోడ్డుపై నిలబెడతా!: పట్టాభి

13-10-2020 Tue 14:24
TDP leader Pattabhi fired on YCP leaders
  • ప్రజల మధ్యకు వచ్చే దమ్ము వైసీపీ నేతలకు లేదు 
  • ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్
  • దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలని పట్టాభి సవాల్

టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరోమారు వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలకు ప్రజల మధ్యకు వచ్చే దమ్ములేదని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పిరికిపందల్లా తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

"చంద్రబాబు గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? చంద్రబాబు మీ నేతలా క్వశ్చన్ పేపర్లు దొంగిలించలేదు. మీ నాయకుడు ఏ ఉద్యమాలు చేశాడు? మనీ ల్యాండరింగ్ ఉద్యమం, సూటు కేసు ఉద్యమాలు చేశాడా? తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దిగమింగారు.

సజ్జలకు చెందిన ఆర్ఆర్ గ్లోబల్ చరిత్ర అంతా నాకు తెలుసు. ఐరన్ ఓర్ ను ఎలా దోచుకున్నారో మాకు తెలియదా? సజ్జల చరిత్ర అంతా నాకు తెలుసు... రోడ్డుపై నిలబెడతా. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది.

మాట్లాడితే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. దమ్ముంటే ఇళ్ల పట్టాల్లో అవినీతిపైనా, విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపైనా, గుమ్మనూరు జయరాం అంశంలోనూ సీబీఐ విచారణ వేయండి. సొంత బాబాయ్ హత్య జరిగితే సీబీఐ విచారణ వద్దని పిటిషన్ వెనక్కి తీసుకున్న చరిత్ర మీది" అంటూ పట్టాభి నిప్పులు చెరిగారు.