Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్

  • ఆర్టికల్ 370పై ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు
  • బీజేపీ నేత సంబిత్ పాత్రా వక్రభాష్యం చెప్పారన్న నేషనల్ కాన్ఫరెన్స్
  • తమ నేత అటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ
National Conference Party clarifies Farooq Abdulaah remarks

ఆర్టికల్ 370 రద్దు కారణంగానే సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించినట్టు ఇటీవల కథనాలు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును చైనా ఎప్పటికీ అంగీకరించదని, చైనా మద్దతుతో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నోచుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నట్టుగా ఆ కథనాల్లో పేర్కొన్నారు. తాజాగా ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వివరణ ఇచ్చింది. తమ ముఖ్యనేత అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది.

ఆర్టికల్ 370 రద్దు కారణంగా కశ్మీర్ ప్రజల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని వెల్లడించారు తప్ప, ఇతర వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి వివరించారు. చైనా దన్నుతో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఫరూక్ అబ్దుల్లా చెప్పారనడం అవాస్తవం అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను బీజేపీ నేత సంబిత్ పాత్రా వక్రీకరించారని ఆరోపించారు.

గతంలోనూ ఫరూక్ వ్యాఖ్యలకు సంబిత్ ఇలాగే తప్పుడు భాష్యం చెప్పారని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దును ఎవరూ హర్షించడంలేదని చెప్పడమే ఫరూక్ అబ్దుల్లా మనోగతం అని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రతినిధి స్పష్టం చేశారు.

More Telugu News