పబ్ లో కిక్కిరిసిన యువతీ యువకుల వీడియో... గచ్చిబౌలీలోని పబ్ ను సీజ్ చేసిన అధికారులు!

13-10-2020 Tue 12:01
Gachibowly Pub Sease
  • భౌతిక దూరం, మాస్క్ లు లేకుండా యువతీ యువకులు
  • వీడియో వైరల్ కావడంతో అధికారుల దాడి
  • అన్ని పబ్ యాజమాన్యాలకూ నోటీసులు

హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలీలో ఉన్న రీసైన్ స్కై బార్ పబ్ లో తీసిన వీడియో ఒకటి వైరల్ కావడంతో, అధికారులు దాడి చేసి దాన్ని సీజ్ చేశారు. ఈ పబ్ లో కిక్కిరిసిన యువతీ యువకుల వీడియో ఒకటి వైరల్ అయింది. ఎవరి మధ్యా భౌతిక దూరం లేకపోగా, ఒక్కరు కూడా మాస్క్ లను ధరించలేదని తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నిన్న ఎక్సైజ్, సిటీ పోలీసు విభాగం అధికారులు దాడి చేసి, పబ్ ను సీజ్ చేశారు.

కరోనా నిబంధనలను అతిక్రమించారన్న సెక్షన్లపై పబ్ యజమానులపై కేసును నమోదు చేశామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈ వీడియోను ఓ సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత బుధవారం రాత్రి ఈ వీడియోను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తరువాత, వెయిటర్లు, బార్ సిబ్బంది కూడా మాస్క్ లను ధరించ లేదని, భారీ ఎత్తున కస్టమర్లను ఆహ్వానించారని, వారెవరూ నిబంధనలు పాటించలేదని తేల్చారు.

రీసైన్ స్కై బార్ లో జరిగిన ఉదంతం తరువాత, నగర పరిధిలోని అన్ని బార్లు, పబ్ యాజమాన్యాలకు ప్రత్యేక నోటీసులు పంపించామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. కొవిడ్ ప్రొటోకాల్ మేరకు బార్ లేదా పబ్ కెపాసిటీలో సగానికి మాత్రమే అనుమతి ఉంటుందని, నృత్యాలు, డీజేలు నిషేధమని తెలిపిన అధికారులు, ప్రస్తుతం అన్ లాక్ 3 గైడ్ లైన్స్ ను అమలు చేస్తున్నామని అన్నారు.