అద్భుతమైన శక్తి ప్రవేశించింది... ఎవరికైనా గట్టిగా ముద్దివ్వగలను: డొనాల్డ్ ట్రంప్

13-10-2020 Tue 10:15
Trump Says that he Could Give You A Big Fat Kiss
  • ఫ్లోరిడాలో ట్రంప్ ఎన్నికల ప్రచారం
  • తాను కరోనా నుంచి బయటపడ్డానన్న ట్రంప్
  • రోగ నిరోధక శక్తి పెరిగిందన్న యూఎస్ ప్రెసిడెంట్

కరోనా సోకి దాదాపు 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో ఆయన డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ను ఎదుర్కోనున్నారు. "నేను కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాను. నా శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా ఉంది" అని ఆయన అన్నారు.

"నేనిప్పుడు చాలా బలంగా ఉన్నాను. అద్భుతమైన శక్తి నాలో ప్రవేసించింది. నేను ఎవరి మధ్యకైనా వచ్చి, మీలో ఎవరినైనా ముద్ద పెట్టుకోగలను. అది మగవారైనా, అందమైన మహిళలైనా... గట్టిగా ముద్దివ్వగలను" అని వందలాది మంది మద్దతుదారుల కేరింతల మధ్య ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, ట్రంప్ శరీరం నుంచి వైరస్ పూర్తిగా బయటపడిందని, ఆయన్నుంచి ఇక ఎవరికీ వైరస్ వ్యాపించదని వైట్ హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే మూడు వారాల్లో విస్తృతంగా పర్యటించి, తన ప్రచారాన్ని నిర్వహించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలలో బైడెన్ తో పోలిస్తే, ట్రంప్ వెనుకబడివున్నారని తేల్చిన నేపథ్యంలో, ఆయన నష్ట నివారణ చర్యల్లో ఉన్నారని తెలుస్తోంది.