మరో బయోపిక్ కు సన్నాహాలు.. సౌందర్యగా సాయిపల్లవి?

12-10-2020 Mon 12:49
Soundarya biopick on cards
  • ఇటీవల ఊపందుకున్న బయోపిక్ ల నిర్మాణం
  • సిల్క్ స్మిత, సావిత్రి బయోపిక్ లకు మంచి ఆదరణ
  • దక్షిణాది భాషల్లో సౌందర్య బయోపిక్ కు సన్నాహాలు    
  • ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం.. త్వరలో పూర్తి వివరాలు  

గత కొంతకాలంగా భారతీయ భాషల్లో బయోపిక్ ల నిర్మాణం ఊపందుకుంది. వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసిన సెలబ్రిటీల కథలను ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల, క్రికెటర్ల బయోపిక్ లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమధ్య వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్ 'ద డర్టీ పిక్చర్', ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రాలకు విశేష ఆదరణ లభించింది.

ఈ క్రమంలో దక్షిణాదిన పేరుతెచ్చుకున్న మరో సినీ నటి జీవితకథ కూడా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, అర్థాంతరంగా ప్రమాదంలో మరణించిన ప్రముఖ కథానాయిక సౌందర్య బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో సౌందర్యలా హోమ్లీ పాత్రలు పోషిస్తూ పేరుతెచ్చుకుంటున్న సాయి పల్లవి ఇందులో సౌందర్య పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయిందని అంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సాయిపల్లవితో చిత్ర నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతోందట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.