కరోనా నుంచి విముక్తుడినయ్యాను: డొనాల్డ్ ట్రంప్

12-10-2020 Mon 08:33
Trump Says that he is now Immune from Corona
  • నేడు ఫ్లోరిడాలో ఎన్నికల ర్యాలీ
  • ఎన్నికలకు మరో మూడు వారాల సమయం
  • కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించడం లేదని విమర్శలు

తాను కరోనా నుంచి విముక్తుడిని అయ్యానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ కారణంగా ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలు లేవని వైట్ హౌస్ డాక్టర్ ప్రకటించిన గంటల తరువాత, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 కరోనా తరువాత తన తొలి ర్యాలీని నేడు నిర్వహించనున్న ట్రంప్, వైరస్ నుంచి తాను పూర్తి రక్షణ పొందానని, తనకు రోగనిరోధక శక్తి చేకూరిందని తెలిపారు. ఆదివారం నాడు ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్, తాను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులను కూడా కలిసినట్టు తెలిపారు.

యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, ఈ మూడు వారాలు దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు జరిపేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నారు. నేడు ఆయన ఫ్లోరిడాలో పర్యటించి, తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనల ప్రకారం, ట్రంప్ మరికొన్ని రోజులు ఐసోలేషన్ లో ఉండాల్సినప్పటికీ, అందుకు ఆయన సుముఖంగా లేరు. తన నుంచి వైరస్ ఎవరికీ అంటే అవకాశాలు లేవని స్పష్టం కావడంతో, ఆయన బయటకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు.

కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ పర్యటనలపై అదనపు జాగ్రత్తలు తీసుకోనున్నారా? అన్న విషయమై వైట్ హౌస్ అధికారులు స్పష్టతను ఇవ్వలేదు. ఆయన ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ లో ఉండే మిగతా వారికి రక్షణగా చేపట్టాల్సిన చర్యల గురించి కూడా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ప్రజలు అందరూ పాటిస్తున్న కొవిడ్ ప్రొటోకాల్ ను అధ్యక్షుడు మాత్రం పాటించడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.