తన బాధ్యతలను ఇంటర్ విద్యార్థినికి అప్పగించిన అనంతపురం జిల్లా కలెక్టర్

11-10-2020 Sun 13:22
Ananthapur district collector handed over his charge to Inter student for a day
  • నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
  • అనంతపురం జిల్లాలో వినూత్న కార్యక్రమం
  • కలెక్టర్ బాటలో ఇతర అధికారులు
  • బాలికలకు ఒక్కరోజు బాధ్యతల అప్పగింత

ఇవాళ అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఉన్నతాధికారులు తమ ఒకరోజు బాధ్యతలను అమ్మాయిలకు అప్పగించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తన సీట్లో ఎం.శ్రావణి అనే ఇంటర్ విద్యార్థినిని కూర్చోబెట్టారు. ఇవాళ్టికి ఆమే కలెక్టర్ అంటూ బాలికల పట్ల తన గౌరవాన్ని చాటారు. శ్రావణి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. నేటి సాయంత్రం వరకు శ్రావణి కలెక్టర్ గా వ్యవహరించనుంది.

కలెక్టర్ బాటలోనే మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు కూడా బాలికలకు తమ బాధ్యతలు అప్పగించి అంతర్జాతీయ బాలికా దినోత్సవ స్ఫూర్తిని చాటారు. కాగా, బాలికా దినోత్సవం సందర్భంగా పదవీబాధ్యతలు నిర్వర్తించనున్న అమ్మాయిలు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించాలంటూ కిందిస్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిన్ననే ఆదేశాలు ఇచ్చారు.