Komatireddy Venkat Reddy: ఎల్ఆర్ఎస్ ప్రజలకు పెను భారంగా మారిందంటూ కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ

  • కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగుతుంది
  • ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను రద్దు చేయండి
Komatireddy Venkat Reddy writes letter to KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని... కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని లేఖలో తెలిపారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలు ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని... తెలంగాణ అసెంబ్లీలో సైతం ఈ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ తీర్మానానికి సభలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలని కోరారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ పై ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలని విన్నవించారు.

ఒకవేళ రద్దు చేయడం సాధ్యంకాని పక్షంలో... కనీసం ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు ప్రజలకు పెను భారంగా మారాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయాలని కోరుతున్నానని చెప్పారు.

More Telugu News