రెండు సినిమాలకు ఓకే చెప్పిన మలయాళ ముద్దుగుమ్మ!

10-10-2020 Sat 15:58
Anupama gives nod for two films in Telugu
  • 'ప్రేమమ్'తో గుర్తింపు పొందిన అనుపమ 
  • ఆమె ఖాతాలో 'శతమానం భవతి' హిట్
  • అనుకున్నంతగా బిజీ కాలేకపోయిన భామ
  • తాజాగా 'కార్తికేయ 2', '18 పేజెస్' చిత్రాలు      

తెలుగులో ఎప్పుడూ హీరోయిన్లకు కొరత లేదు. తెలుగమ్మాయిలు లేకపోయినా పరభాషల నుంచి వచ్చి, ఇక్కడ సందడి చేసే హీరోయిన్లు బాగానే వున్నారు. ముంబై భామలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ ముద్దుగుమ్మలు టాలీవుడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. పారితోషికం బాగుండడంతో పాటు, ఒక పధ్ధతి ప్రకారం ఇక్కడ చిత్ర నిర్మాణం జరుగుతుంది. దాంతో ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ పూర్తవుతుంది. అందుకే, ఇతర భాషల హీరోయిన్లు తెలుగు చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.

ఇక గత కొంత కాలంగా తెలుగులో సినిమాలు చేస్తున్న హీరోయిన్లలో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా వుంది. 'ప్రేమమ్' చిత్రం ద్వారా గుర్తింపు పొందిన అనుపమ కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి పేరు తెచ్చుకుంది. అయితే, అనుకున్నంతగా మాత్రం ఆమె ఇక్కడ బిజీ కాలేదు. 'శతమానం భవతి' వంటి సూపర్ హిట్ సినిమా పడినా, ఇంకా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం ఆమెకు రాలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది తెలుగులో రెండు సినిమాలకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో 'కార్తికేయ 2' ఒకటి కాగా, మరొకటి '18 పేజెస్'. విశేషం ఏమిటంటే, ఈ రెండింటిలోనూ కూడా హీరో నిఖిల్ కావడం!